Amaravati Padayatra: అమరావతి రైతుల ‘మహా పాదయాత్ర’ ప్రారంభం

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో

Updated : 13 Nov 2023 11:11 IST

అమరావతి: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్‌తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు తలపెట్టిన ‘మహా పాదయాత్ర’ ప్రారంభమైంది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో ప్రారంభించిన ఈ యాత్రకు తుళ్లూరులో శ్రీకారం చుట్టారు. ఇది తిరుపతి వరకు కొనసాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన ఈ పాదయాత్ర.. మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు.

వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాల మద్దతు

అమరావతి రైతులు ప్రారంభించిన ఈ పాదయాత్రకు అధికార వైకాపా మినహా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. తెదేపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, అమరావతి బహుజన ఐకాస, దళిత బహుజన ఫ్రంట్‌ తదితర రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి తెదేపా తరఫున ఆ పార్టీ సీనియర్‌ నేతలు దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, నేతలు తెనాలి శ్రవణ్‌కుమార్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేవరకు తమ మద్దతు కొనసాగుతుందని తెదేపా నేతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని