Heavy Rains in Telangana: జల దిగ్బంధంలో నిర్మల్‌, భైంసా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్‌ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుండటంతో స్వర్ణ, కడెం, భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద

Updated : 22 Jul 2021 19:07 IST

భైంసా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్‌ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుండటంతో స్వర్ణ, కడెం, భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కసారిగా గేట్లు ఎత్తి నీరు వదిలేయడంతో భైంసా ఆటోనగర్‌లోని ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ఆటోనగర్‌, ఎన్‌.ఆర్‌.గార్డెన్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 150 మందిని అగ్నిమాపక సిబ్బంది, గజఈతగాళ్లు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భైంసా ఎన్‌.ఆర్‌.గార్డెన్‌లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో బోట్ల సాయంతో వారిని గజఈతగాళ్లు రక్షించారు. వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో ఆటోనగర్‌, ఎన్‌.ఆర్‌.గార్డెన్ ప్రాంతాల్లో దాదాపు 60 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. స్వర్ణ జలాశయం ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదలడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. స్వర్ణ వాగుకు సమీపంలో గల జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్‌లోని జీఎన్ఆర్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడంతో నీట మినిగింది. కాలనీలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి తాగడానికి మంచినీళ్లు లేక, ప్రాణాలు రక్షించుకునేందుకు ఇళ్లపైకి చేరి బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, జిల్లా ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఫైర్ ఇంజన్, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని తాళ్లు, తెప్పల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

నిర్మల్‌, భైంసాలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్‌లో చేపట్టిన సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నిర్మల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపుతున్నట్టు తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని