Ts cabinet: 5రోజుల్లో ఖాళీల వివరాలివ్వాలి

ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఏపీ నుంచి వచ్చే వారికి వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించాలని సంబంధిత శాఖాధిపతులను మంత్రివర్గం ఆదేశించింది. ఖాళీల సంఖ్యను మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించాలని సూచించింది..

Updated : 14 Jul 2021 22:01 IST

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మిగతా తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఏపీ నుంచి వచ్చే వారికి వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించాలని సంబంధిత శాఖాధిపతులను మంత్రివర్గం ఆదేశించింది. ఖాళీల సంఖ్యను మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించాలని సూచించింది. ఉద్యోగ ఖాళీల వివరాలను ఐదు రోజుల్లోగా తెలపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాల్లో వృద్ధికి అనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’ని ఆమోదించింది. ఈ పాలసీలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. తద్వారా ఈ రంగంలో పత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అందుకు అనుగుణంగా రాష్ట్రానికి దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్ సూచించింది.

రాష్ట్రంలో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ సహా వివిధ రకాల లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారుగా 1,400 ఎకరాల్లో భారీ స్థాయిలో డ్రై పోర్టును (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో టాస్క్ సాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించాలని నిర్ణయించింది. అన్నిరకాల రంగాలకు చెందిన వస్తువుల నిల్వ సామర్థ్యం పెంచుకోవడానికి లాజిస్టిక్స్ పాలసీ చేయూతనిస్తుందని అభిప్రాయపడింది. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, వేర్‌హౌజ్‌లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు రకాల ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని