Covid: తెలంగాణలో సెకండ్ వేవ్‌ ముగిసిపోయింది: డీహెచ్‌ శ్రీనివాస్‌

రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. దోమలు, లార్వా వృద్ధి నివారణ చర్యలు

Updated : 18 Aug 2021 15:51 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ తెలిపారు. దోమలు, లార్వా వృద్ధి నివారణ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోఠిలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో డెంగీ కేసులు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 డెంగీ కేసులు వచ్చాయని.. మొత్తంగా 13 జిల్లాల్లో మలేరియా, డెంగీ జ్వరాల కేసులు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు నడుస్తున్నాయని డీహెచ్‌ తెలిపారు.

అన్ని జ్వరాలు కొవిడ్‌ లక్షణాలు కాదు..

రాష్ట్రంలో కొవిడ్ చాలా వరకు అదుపులోకి వచ్చిందని.. సెకండ్‌ వేవ్‌ ముగిసి పోయిందని డీహెచ్‌ తెలిపారు. అన్ని జ్వరాలను కొవిడ్‌ జ్వరాలని అనుకోవద్దని పేర్కొన్నారు. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జ్వరం, కళ్లు తిరగడం, విరోచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలన్నారు. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్ లెట్ ఎక్స్‌ట్రాక్షన్‌ యంత్రాలను సిద్ధంగా ఉంచామని.. పెద్ద ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లీనిక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆర్ ఫ్యాక్టర్ 0.7 శాతంగా ఉందని.. పోస్ట్ కొవిడ్‌తో ఆస్పత్రిలో చేరిన వారు ఎక్కువగా ఉన్నారన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1.65 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్లు డీహెచ్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 56శాతం మందికి మొదటి డోస్, 34 శాతం మందికి రెండో డోసు వేసినట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 90 శాతం ప్రజలకు తొలి డోసు ఇచ్చినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని