Drugs: ఆ ‘మత్తు’ మనకెందుకులే!

రూ.కోట్ల విలువైన మత్తుమందుల రవాణా కేసుల్లో అసలు నిందితులు దొరకరు..

Published : 07 Sep 2021 10:22 IST

అరెస్టయిన విదేశీ నిందితులను పట్టించుకోని ఆ దేశాల రాయబార కార్యాలయాలు 
బెయిల్‌ దరఖాస్తుకూ నోచుకోని నలుగురు నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌: రూ.కోట్ల విలువైన మత్తుమందుల రవాణా కేసుల్లో అసలు నిందితులు దొరకరు.. అరెస్టయిన కొసరు నిందితులను ఎవరూ పట్టించుకోరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ కేసుల్లో గత మూడు నెలల్లో శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్టయిన నలుగురు విదేశీయుల విషయంలో ఆ దేశాల రాయబార కార్యాలయాలు మౌనంగా ఉంటున్నాయి. వారి తరఫున బెయిల్‌కు దరఖాస్తు చేసేవారూ కరవయ్యారు. ఈ పరిస్థితిలో ఈ నలుగురు నిందితులకు ఇప్పట్లో ఉపశమనం కలిగే అవకాశం కనిపించడం లేదు. దర్యాప్తు సంస్థ అభియోగపత్రాలు దాఖలు చేసి, న్యాయవిచారణ పూర్తి చేసిన తర్వాత మాత్రమే వీరి భవిష్యత్తు తేలనుంది. కేసుని కొట్టేస్తే మానవతా దృక్పథంతో భారత ప్రభుత్వమే వారిని పంపాల్సి ఉంటుంది. శిక్ష పడితే అది పూర్తయ్యాక మన ప్రభుత్వమే కల్పించుకోవాల్సి ఉంటుంది. విచారణ పూర్తికావడానికి కనీసం రెండు మూడేళ్లయినా పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ వీరు మన జైళ్లలో మగ్గాల్సిందే. 

ఆఫ్రికా దేశాల నుంచి హెరాయిన్‌ సరఫరా చేస్తూ జూన్‌ 5, 6, జులై 19 తేదీల్లో ఉగాండ, జాంబియా దేశాలకు చెందిన జూలియా బ్రెండా, కారోల్, మరో మహిళ అరెస్టయిన విషయం తెలిసిందే. జూన్‌ 21న టాంజానియాకు చెందిన జాన్‌ విలియమ్స్‌ అనే వ్యక్తి దొరికారు. వీరంతా వారి దేశాల్లో ఫుట్‌పాత్‌ మీద చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్నారని, డబ్బుకు ఆశపడి మత్తుమందుల రవాణాకు ఒప్పుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. డ్రగ్స్‌ ఇచ్చిన వారు, హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత వీటిని తీసుకోవాల్సిన వారు ఎవరో వీరికి తెలియదు. అంతర్జాతీయస్థాయిలో మత్తుమందుల రవాణా ఇలానే జరుగుతుంది. అమాయకులకు డబ్బు ఎరవేసి మత్తుమందులు రవాణా చేయిస్తుంటారు. ఒకవేళ వీరు దొరికినా అసలు సూత్రధారుల వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతుంటారు. ఈ నలుగురి విషయంలోనూ అలానే జరిగింది.

విదేశీయులు ఎవరైనా నేరం చేసి పట్టుబడితే వారి పాస్‌పోర్ట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఆ దేశ రాయబార కార్యాలయానికి మన అధికారులు సమాచారం ఇస్తారు. తద్వారా వారు తమ దేశ పౌరులకు అవసరమైన న్యాయసాయం చేయడంతోపాటు నేరం తీవ్రతను బట్టి వీలైతే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిందితులను తమ దేశానికి తరలిస్తుంటారు. మత్తుమందులు సరఫరా చేస్తూ పట్టుబడటంతో ఈ నలుగురి విషయంలో వారి దేశాల రాయబార కార్యాలయాల నుంచి ఎలాంటి స్పందన లేదని పోలీసు అధికారులు తెలిపారు. సైబర్‌ నేరాల కేసుల్లో పట్టుబడ్డ నిందితులను పోలీసులే బలవంతంగా వారి దేశానికి (డిపోర్టేషన్‌) పంపుతున్నారు. మత్తుమందుల కేసులో ఆ అవకాశం కూడా లేదు. వారి రాయబార కార్యాలయాలు స్పందిస్తే ఎంతోకొంత ఉపశమనం కలుగుతుంది. విచారణ పూర్తయ్యే వరకూ తమ పర్యవేక్షణలో ఉంచుకుంటామని హామీ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో అయినా బెయిల్‌ ఇప్పించడానికి అవకాశం ఉంది. కానీ ఈ నలుగురి విషయంలో ఆయా దేశాల రాయబార కార్యాలయాల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని