AP News: జగన్‌ నివాస పరిసరాల్లో ఉద్రిక్తత

తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.

Updated : 19 Jul 2021 10:48 IST

తాడేపల్లి(అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ను నిరసిస్తూ వివిధ యువజన, విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో తాడేపల్లి’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ జాతీయ రహదారి నుంచి సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి తెదేపా అనుబంధ విభాగాలు తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ఐ, వివిధ యువజన, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ ఐకాస ర్యాలీగా బయల్దేరాయి. దీంతో సీఎం నివాస పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తాడేపల్లి పాత టోల్‌గేట్‌ కూడలి వద్ద ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఓ దశలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలంటూ ఆయా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం పలువురు టీఎస్‌ఎస్‌ఎఫ్‌, యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిరసనకారులను గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో ముగ్గురు ఎస్పీలు, డీఎస్పీలు సహా సుమారు వెయ్యి మంది పోలీసులు మోహరించారు. సీఎం ఇంటి వైపు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

‘చలో తాడేపల్లి’ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఆదివారం నుంచే అన్ని చోట్లా ఆయా సంఘాల నేతలను గృహనిర్బంధం చేశారు. ఈ కార్యక్రమానికి అమరావతి దళిత ఐకాస మద్దతు తెలిపిన నేపథ్యంలో ఐకాస నేతలను ఇళ్లలోనే పోలీసులు నిర్బంధించారు. మరోవైపు గుంటూరు జిల్లాకు వస్తున్న వారిపై పోలీసులు నిఘా ఉంచారు. డ్రోన్‌ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 

 

శాంతియుత ఉద్యమాలపై ఉక్కుపాదం తగదు: రామకృష్ణ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలంటూ పిలుపునిచ్చిన నిరుద్యోగ, యువజన, విద్యార్థి సంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. శాంతియుత నిరసనలపై ఉక్కుపాదం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర ఉద్యోగాల భర్తీతో జాబ్‌ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడటమేనన్నారు. రెండేళ్లుగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకుండా సీఎం జగన్‌ మాట తప్పడం నిజం కాదా?అని రామకృష్ణ ప్రశ్నించారు.

నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ వద్ద నేతల ఆందోళన

నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువజన, విద్యార్థి సంఘాల నేతలు స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సీఐ ప్రేమయ్య ఆందోళన ఆపమని చెప్పారు. సీఐ వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేసిన యువజన సంఘాలు.. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు