Ap News: అలిపిరి శ్రీవారి పాదాల చెంత ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర

ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగిసింది. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల

Updated : 14 Dec 2021 18:35 IST

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగిసింది. అలిపిరి శ్రీవారి పాదాల చెంతకు పాదయాత్ర ప్రచార రథం చేరగానే 108 కొబ్బరికాయలు కొట్టి జేఏసీ ప్రతినిధులు పాదయాత్రకు ముగింపు పలికారు. స్థానికులు గుమ్మడికాయలతో దిష్టితీసి మంగళహారతులు పట్టారు. రైతుల గోవింద నామస్మరణతో అలిపిరి ప్రాంతమంతా మారుమోగింది. జై అమరావతి, జైజై అమరావతి నినాదాలతో అలిపిరి ప్రాంగణం హోరెత్తింది.

నవంబర్‌ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 45వ రోజైన ఇవాళ అలిపిరిలో ముగిసింది. 44 రోజులుగా రైతులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 450 కి.మీ. పైగా పాదయాత్ర చేశారు. చివరి రోజు మహాపాదయాత్రకు అశేషజనవాహిని తరలివచ్చి రాజధాని అమరావతికి జై కొట్టింది. ఇవాళ తిరుపతికి చేరుకున్న రైతుల పాదయాత్ర నగరంలో 9 కి.మీ. మేర సాగింది. ఒక్క చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జననీరాజనం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తిరుపతి వీధుల్లో అమరావతి ఆకాంక్షను వినిపిస్తూ లక్ష్యాన్ని చేరుకున్నారు.

రేపటి నుంచి మూడు రోజులపాటు రోజుకు 500 మంది చొప్పున శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. తితిదే నియమనిబంధనలను అనుసరించి తాము నడుచుకుంటామని రైతులు స్పష్టం చేశారు. సుదీర్ఘ పాదయాత్రలో తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 17వ తేదీన తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని