
Amaravati Padayatra: 22వ రోజుకు ‘మహాపాదయాత్ర’.. పోలీసుల ఆంక్షలు
అమరావతి: అమరావతినే ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 22వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న యాత్ర ఇవాళ నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 13 కిలోమీటర్ల మేర సాగి కొండ బిట్రగుంటలో ముగియనుంది. అంతక ముందు రైతులు స్థానికంగా ఉన్న ఓ చర్చిలో ప్రార్థనలు చేసి యాత్రను ప్రారంభించారు.
‘మహాపాదయాత్ర’కు స్థానికులు నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు పాదయాత్రలో ఎక్కువ మంది పాల్గొన్నారంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా డిసెంబర్ 15కు తిరుమలకు చేరనుంది.