Amaravati Padayatra: చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన రైతుల ‘మహాపాదయాత్ర’

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది.

Updated : 07 Dec 2021 13:22 IST

వెంకటగిరి: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. 37వ రోజు పాదయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభమైంది. ఇవాళ సుమారు 16 కిలోమీటర్ల మేర సాగే యాత్ర చింతలపాలెం వరకు సాగనుంది. ఈ ఉదయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజపల్లెలోకి యాత్ర ప్రవేశించగానే రైతులకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. తెదేపా నేతలు అమర్నాథ్‌రెడ్డి, పులవర్తి నాని, బొజ్జల సుధీర్‌ సంఘీభావం తెలిపారు. అంతకముందు వెంకటగిరిలో యాత్ర ముగించుకొని వెళుతున్న రైతులకు స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. పాదయాత్రకు మాజీ ఎమ్మెల్యే కొరుగండ్ల రామకృష్ణ రూ.10లక్షల విరాళం ఇచ్చారు.

ఈ నెల 15, 16 తేదీల్లో శ్రీవారి దర్శనంపై తితిదే(తిరుమల తిరుపతి దేవస్థానం)ను అభ్యర్థించినట్లు అమరావతి ఐకాస ప్రతినిధులు తెలిపారు. దాదాపు 500మందికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని కోరినట్లు చెప్పారు. పాదయాత్రలో దాదాపు 200 కుటుంబాలు పాల్గొంటున్నాయని వివరించామన్నారు. వీరందరికీ ఒక్కసారిగా కాకున్నా విడతల వారీగా దర్శనం కల్పించాలని.. పాదయాత్ర చేసి వచ్చిన భక్తులకు శ్రీవారి మొక్కు చెల్లించే అవకాశం ఇవ్వాలని తితిదేను కోరినట్లు చెప్పారు.

మరోవైపు ఈ నెల 17న తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతిపై పోలీసులు ఇంకా స్పందించలేదని ఐకాస ప్రతినిధులు చెప్పారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపామని వివరించారు. త్వరితగతిన అనుమతి ప్రకటిస్తే ఏర్పాటు చేసుకుంటామన్నారు. సభకు అనుమతిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనుమతి తిరస్కరిస్తే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం అని ఐకాస ప్రతినిధులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని