AP Govt: నకిలీ చలానాల ఎఫెక్ట్‌: మిగతా శాఖల్లోనూ తనిఖీలు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో ఏపీ ప్రభుత్వం మిగతా శాఖల్లోనూ తనిఖీలు మొదలు పెట్టింది.

Updated : 03 Sep 2021 15:15 IST

అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో ఏపీ ప్రభుత్వం మిగతా శాఖల్లోనూ తనిఖీలు మొదలు పెట్టింది. చలానాల ద్వారా చెల్లించే నగదు జమపై విచారణ చేపట్టింది. నగదు సీఎఫ్‌ఎంస్‌కు జమ అవుతోందా? లేదా? అనే అంశంపై అధికారులు కూపీ లాగుతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సుమారు రూ.8కోట్ల మేర అక్రమాలు జరగ్గా.. ఇప్పటి వరకు దాదాపు రూ.4కోట్ల వరకు రికవరీ చేశారు. అక్రమాలకు బాధ్యులను చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 14 మంది  సబ్‌రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

ఈ క్రమంలో ఆదాయం ఆర్జించే మిగతా శాఖల్లోనూ కొన్ని చోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆయా శాఖల్లోనూ తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా ఎక్సైజ్‌, మైనింగ్‌, రవాణా, కార్మికశాఖల్లో అంతర్గతంగా అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం అవకతవకలు జరిగిన చోట బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముంది.

ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చలాన్ల మార్ఫింగ్

ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చలాన్లను మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 71 డాక్యుమెంట్లకు సంబంధించి 77 చలాన్లను మార్ఫింగ్ చేసినట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.26 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ విజయలక్ష్మీ.. ఒంగోలు ఒకటో పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని