Ap News: తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు అనుమతి

న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర నిర్వహించిన అమరావతి ప్రాంత రైతులకు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణ కోసం హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బహిరంగ సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది.....

Published : 16 Dec 2021 01:07 IST

అమరావతి: న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర నిర్వహించిన అమరావతి ప్రాంత రైతులకు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణ కోసం హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బహిరంగ సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. తమ బహిరంగ సభకు అదే రోజు అనుమతి ఇవ్వాలని రాయలసీమ హక్కుల సాధన సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఒకే రోజు అనుమతి ఇచ్చేది లేదని, మర్నాడు సభ నిర్వహించుకోవాలని న్యాయస్థానం సూచించింది.

బహిరంగ సభ అనుమతి విషయమై హైకోర్టులో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. తిరుపతి నగర శివారులోని నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారికి సమీపంలోని ప్రైవేటు స్థలంలో బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి పరిరక్షణ సమితి భావిస్తోందని. 44 రోజులపాటు నాలుగు జిల్లాల పరిధిలో ఎక్కడా ఎలాంటి శాంతిభధ్రతల సమస్య లేకుండా రైతుల మహాపాదయాత్ర సాఫీగా సాగిన విషయాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. పాదయాత్ర అనంతరం బహిరంగ సభ కోసం అనుమతి ఇవ్వాలని పరిరక్షణ సమితి ద్వారా చిత్తూరు జిల్లా పోలీసులను కోరినా వారు నిరాకరించారని తెలిపారు. బహిరంగ సభకు అనుమతి ఇస్తే ప్రాంతీయ ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పాదయాత్ర సమయంలో పోలీసులపై అమరావతి రైతులు దాడి చేశారంటూ కొన్ని వీడియో దృశ్యాలను ఏఏజీ న్యాయమూర్తికి చూపించారు. ప్రైవేటు ప్రదేశంలో సభను నిర్వహించుకుంటే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇటీవల కురిసిన భారీ వర్షల కారణంగా రహదారి పూర్తిగా ధ్వంసమైందని ఏఏజీ తెలిపారు. కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల నమోదు తరుణంలో బహిరంగ సభకు అనుమతించలేదని అడిషనల్ ఏజీ తెలిపారు. ఈ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు.. బహిరంగ సభలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొంది. నిబంధనల మేరకు బహిరంగ సభ నిర్వహించుకోవాలని ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని హైకోర్టు సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని