AP News: రాజధాని ఎక్కడనే అంశంపై కాదు.. ప్రభుత్వ విధాన నిర్ణయంపైనే విచారణ: సీజే

రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడం లేదని.. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల చట్టబద్దతపైనే విచారణ జరుపుతున్నామని ..

Updated : 18 Nov 2021 20:31 IST

అమరావతి: రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంపై విచారణ జరపడం లేదని.. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల చట్టబద్దతపైనే విచారణ జరుపుతున్నామని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర అన్నారు. రాజధానికి సంబంధించిన వ్యాజ్యాలపై వరుసగా నాలుగో రోజు హైకోర్టులో విచారణ జరిగింది. సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణరావు, ఉన్నం మురళీధర్‌లు రైతుల తరఫున వాదనలు వినిపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు నిర్ణయంపై అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైకాపా వ్యతిరేకించలేదని న్యాయవాది ఉన్నం మురళీధర్‌ వాదించారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ అమరావతి నిర్ణయాన్ని స్వాగతించారు. దానికి సంబంధించిన వీడియోలు సైతం అవసరమైతే ప్రదర్శిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌ 3 రాజధానుల నిర్ణయం చేశారన్నారు. భూమి, నీరు, భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉండటం, అన్నిటికి అనుకూలమైన ప్రాంతం కావడంతో అమరావతిని ఎంపిక చేశారని తెలిపారు. శివరామకృష్ణ కమిటీ నివేదికలో కూడా వివిధ రకాల సూచనలు చేశారన్నారు. మెజారిటీ ప్రజలు రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని కోరారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఒకసారి ఆమోదించిన మాస్టర్‌ ప్లాన్‌ను మార్చేందుకు వీల్లేదన్నారు. గతంలో అమరావతి రాజధాని నిర్ణయాన్ని ఎవరూ కోర్టులో సవాలు చేయలేదని సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అన్ని ప్రాంతాల అభివృధ్ధి అని చెబుతున్నవారు.. ఆరోజు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.  

ఇప్పుడు 3 రాజధానుల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చరిత్రలో ఒక్కచోట మాత్రమే రాజధాని ఉందన్నారు. పునర్విభజన చట్టంలో ఒక క్యాపిటల్‌ అని మాత్రమే ఉందని తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రైతుల తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వినిపించారు. సీఆర్‌డీఏ ఏర్పడిన తర్వాత అభివృద్ధి జరిగిందని.. అది కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. ఇప్పుడు పునరాలోచన చేయడం అనేది అభివృద్ధి విఘాతమే అవుతుందని తెలిపారు. సమయం ముగియడంతో తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని