AP News: సెంటు స్థలంలో ఇల్లు.. ఎలా సాధ్యం?: హైకోర్టు

నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక  నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును తప్పుబట్టింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించిన 128 మంది పిటిషనర్ల వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు ...

Published : 09 Oct 2021 01:56 IST

అమరావతి: నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక  నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును తప్పుబట్టింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించిన 128 మంది పిటిషనర్ల వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు .. 108 పేజీల తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించింది. గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన 3 జీవోల్లోని పలు నిబంధనలను కొట్టివేసింది.

సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాల నిర్మాణం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాక అగ్ని ప్రమాదాలు, మంచినీటి సమస్యలు వచ్చే ప్రమాదముందని హైకోర్టు పేర్కొంది. వీటిని పరిశీలించకుండా ఇళ్లు కట్టుకోవాలని బలవంతం చేయడం అన్యాయమని వ్యాఖ్యానించింది. ఇళ్ల కేటాయింపునకు తాము వ్యతిరేకం కాదన్న ధర్మాసనం.. కేవలం మహిళలకే కాకుండా విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్లు కేటాయించాలని ఆదేశించింది. గృహ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ, గృహనిర్మాణం, పర్యావరణ శాఖలోని నిపుణులతో కమిటీ వేయాలని ఆదేశించింది. ఈ కమిటీ నివేదిక నెలరోజుల్లో ఇవ్వాలని స్పష్టం చేసింది. నివేదికపై ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి  అప్పుడు గృహనిర్మాణాలు చేపట్టాలని తేల్చి చెప్పింది. అప్పటి వరకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని