
AP News: సినిమా టికెట్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ (జేసీ) ముందుంచాలని.. ఆయనే నిర్ణయం తీసుకుంటారని సూచించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే..
సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 35ను సవాల్ చేస్తూ థియేటర్ల యజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపి ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చారు. జీవో 35కు ముందు అనుసరించిన విధానంలో టికెట్ ధరలను నిర్ణయించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలకు/ పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చారు.
సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. థియేటర్ యాజమాన్యాలు ఎక్కువ ధరలకు టికెట్ ధరలను నిర్ణయించుకునే అవకాశముందని.. దీనివల్ల సామాన్యుడిపై భారం పడుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదనలను ధర్మాసనం ముందు వినిపించారు. దీనిపై స్పందించిన డివిజన్ బెంచ్.. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యాజమాన్యాలు జేసీ ముందు ఉంచాలని ఆదేశించింది. ధరలపై జేసీయే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూడా టికెట్ ధరలపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.