AP Highcourt: గ్రూప్‌-1 ఫలితాలపై ఏపీ హైకోర్టు తీర్పు

గ్రూప్‌-1 పరీక్షల ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను పక్కన పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను హైకోర్టు

Updated : 08 Sep 2022 15:48 IST

అమరావతి: గ్రూప్‌-1 పరీక్షల ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను పక్కన పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

ఏం జరిగిందంటే?

గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో ఎనిమిది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూషన్‌ గురించి చివరి దశలో తెలిపారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఆంగ్ల మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్‌ చేశారని, దీంతో ఆంగ్ల మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్‌ ఎలా చేయిస్తుందని వాదించారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని  పిటిషనర్‌ వాదించారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -1 ఇంటర్వ్యూతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ..ఈ ఏడాది జూన్ 16 న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ.. ధర్మాసనం ఎదుట ఏపీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది . మౌఖిక పరీక్షకు ఎంపికైన కొందరు అభ్యర్థులు కూడా అప్పీళ్లు వేశారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది. 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు