Ap News: చంద్రబాబు ఇంటిపై దాడి ఘటన.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

కరకట్టపై తెదేపా అధినేత చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకే ఎమ్మెల్యే జోగి రమేశ్ వెళ్లారని.. ఇంటిపై దాడికి కాదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు

Updated : 20 Sep 2021 20:25 IST

గుంటూరు: కరకట్టపై తెదేపా అధినేత చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకే ఎమ్మెల్యే జోగి రమేశ్ వెళ్లారని.. ఇంటిపై దాడికి కాదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. కరకట్ట ఘటనపై ఎస్పీలు విశాల్ గున్నీ, ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి డీఐజీ త్రివిక్రమ్ వర్మ మీడియాకు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే జోగి రమేశ్ రాకపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేనప్పటికీ కరకట్ట మొదటి భద్రత అంచె వద్దే అడ్డుకున్నామని చెప్పారు. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనంటూ బయట జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. పూర్తి నిరాధారంగా మీడియాలో కథనాలు ప్రసారం చేశారని డీఐజీ వివరించారు.

ముందుగా జోగి రమేశ్ కారుపైనే దాడి జరిగిందన్నారు. ఆ తర్వాత డ్రైవర్‌ను చెప్పులు, రాయితో కొందరు కొట్టారంటూ వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు. డీజీపీ ఆఫీసులో లేరని తెలిసీ కార్యాలయం వద్ద 70 మంది హడావుడి సృష్టించారన్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చే విధానం ఇది కాదని డీఐజీ అసహనం వ్యక్తం చేశారు. కరకట్ట ఘటనపై ఇరుపక్షాల ఫిర్యాదుల మేర విచారణ జరుగుతోందని.. సాక్ష్యాలు సేకరిస్తున్నామని డీఐజీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు.

కేంద్ర హోంశాఖకు కనకమేడల ఫిర్యాదు..

తెదేపా అధినేత చంద్రబాబుపై దాడికి ప్రయత్నించినట్లు ఆ పార్టీ ఎంపీ కనమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు ఫిర్యాదు చేశారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జడ్‌ప్లస్‌ కేటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నించారని ఈ ఘటనపై పూర్తి ఆధారాలను హోంశాఖ కార్యదర్శికి అందజేశామని తెలిపారు. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినా ఎవరిపైనా కేసు పెట్టలేదన్నారు. తెదేపా నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని వివరించారు. ప్రధాని, హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని