Breakthrough Infection: 25% ఆరోగ్య సిబ్బందిలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌!

వ్యాక్సిన్‌ తీసుకున్న  ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో 25శాతానికి పైగా ఇన్‌ఫెక్షన్‌ (Breakthrough Infection) బారినపడినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Updated : 24 Nov 2022 12:47 IST

తాజా అధ్యయనం వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ సమయంలో పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) వ్యాక్సిన్‌ పొందిన తర్వాత కూడా వైరస్‌బారినపడే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాక్సిన్‌ తీసుకున్న  ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో 25శాతానికి పైగా ఇన్‌ఫెక్షన్‌ (Breakthrough Infection) బారినపడినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. డెల్టా వేరియంట్‌ కారణంగా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరుగుతుందన్న వాస్తవాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోందని పేర్కొంది.

కరోనా వ్యాక్సిన్‌ పొందిన అనంతరం వైరస్‌ బారినపడే అవకాశాలపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ (IGIB), దిల్లీలోని మాక్స్‌ ఆస్పత్రి కలిసి సంయుక్తంగా ఓ అధ్యయనం చేపట్టాయి. ఇందులో భాగంగా 95 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రెండు డోసులు ఇచ్చారు. అనంతరం 45 నుంచి 90 రోజుల తర్వాత పరీక్షించి చూడగా.. వారిలో 25శాతం మందిలో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ కనిపించాయి. వీరిలో ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించలేదు. అయితే, వైరస్‌ బారినపడినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకున్నందున తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా నిరోధించగలిగినట్లు ఐజీఐబీలో సీనియర్‌ శాస్త్రవేత్త శాంతనూ సెన్‌గుప్తా పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ విజృంభణ సమయంలో బ్రేక్‌ త్రూ ఇన్‌ఫెక్షన్‌ సర్వసాధారణమేనన్న విషయం కూడా గుర్తించామని వెల్లడించారు.

పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తోన్న అధ్యయనాల్లోనూ బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఇన్‌ఫెక్షన్‌ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇలా బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ కేసుల్లో లక్షణాలేవీ కనిపించకపోతున్నందున వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ మాస్కులు, భౌతిక దూరం వంటి నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని