
TS News: జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ: గవర్నర్ తమిళి సై
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పీవీ సమాధి వద్ద గవర్నర్ తమిళి సై నివాళులు అర్పించారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ అని కొనియాడారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, భాజపా నేత లక్ష్మణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పీవీ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు. దేశంలో దక్షిణాది వారికి సరైన గుర్తింపు లభించడం లేదని మంత్రి తలసాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రమాదం అంచున ఉన్న దేశానికి ఎన్నో సంస్కరణలతో బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేసిన పీవీకి కేంద్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.