Rayalaseema project: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి కేంద్రం నివేదిక

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం

Updated : 08 Sep 2021 18:20 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)కి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం పనులు నిలిపివేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. సీమ ఎత్తిపోతల పథకం వాస్తవ, సాంకేతిక పరిస్థితులపై ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నివేదిక సమర్పించిన విషయాన్ని నివేదికలో కేంద్రం ప్రస్తావించింది. అలాగే పర్యావరణ అనుమతులు పెండింగ్‌ ఉన్నాయని కేంద్రం పేర్కొంది. కానీ అక్కడ జరిగిన పనులను చూస్తే డీపీఆర్‌ కోసం జరిగినట్లు కనిపించట్లేదని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం అభిప్రాయపడినట్లు తెలిసింది. ఉల్లంఘనలపై చర్యలు తీసుకొనే అధికారం ఎన్జీటీకి ఉందా? లేదా? అనే అంశంపై తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీని కోరింది. ఈ మేరకు వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీకి ఫొటోలు, వీడియోలు పంపించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి విచారణను ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఈ నెల 16కి వాయిదా వేసింది.

ఎన్జీటీ ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, సభ్యుడు మౌతాంగ్, కేంద్ర జలసంఘం సంచాలకులు దర్పన్ తల్వార్‌తో కూడిన బృందం ఆగస్టు 11న ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించింది. అనంతరం నివేదిక సిద్ధం చేసి ఎన్జీటీకి అందించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ తయారీ అవసరానికి మించి ప్రాజెక్టు పనులు చేపట్టారని కృష్ణా బోర్డు బృందం అభిప్రాయపడింది. ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను ఛాయాచిత్రాలతో సహా నివేదికలో పొందుపర్చింది. అప్రోచ్ ఛానల్, ఫోర్ బే, పంప్ హౌస్, డెలివరీ మెయిన్, లింక్ కెనాల్, బ్యాచింగ్ ప్లాంట్, నిర్మాణ సామగ్రి తదితరాల వివరాలతో ఎన్జీటీకి నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని కేఆర్‌ఎంబీ బృందం స్పష్టం చేసింది. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, ఇతర సామగ్రిని అక్కడ నిల్వ చేశారని తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు