AP News: అనేక పదవులకు వెంకయ్యనాయుడు వన్నె తెచ్చారు: అమిత్‌షా 

భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొనియాడారు.

Updated : 14 Nov 2021 13:24 IST

వెంకటాచలం: భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చాలా కృషి చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కొనియాడారు. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు వన్నె తెచ్చారన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి వెంకయ్యనాయుడితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ‘‘ 370 రద్దు బిల్లు ఆమోదంలో వెంకయ్యనాయుడు కీలకపాత్ర పోషించారు. ఎంత ఎదిగినా మన మూలాలు మర్చిపోవద్దనే ఒక మాట ఉంది. వెంకయ్య మాతృభూమిని ఎప్పుడూ మర్చిపోలేదు. స్వర్ణభారత్‌ ట్రస్టు.. వెంకయ్యనాయుడి గొప్ప ఆలోచన.  రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆయన పరితపిస్తుంటారు.

మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ ఎంచుకున్నారు. విద్యార్థి స్థాయి నుంచే నాయకుడిగా ఉన్నారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు. జయప్రకాశ్‌ నారాయణ స్ఫూర్తితో ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో వెంకయ్య పాల్గొన్నారు. జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్నో ఉన్నతస్థాయి చర్చల్లో వెంకయ్య చురుకుగా పాల్గొన్నారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థుల కోసమే ఆలోచించేవారు. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న నా అభిలాష నెరవేరింది.

గతంలో సిఫార్సుల మేరకే పద్మ పురస్కారాలు దక్కేవి. ప్రతిభ, సేవతోనే ఇప్పుడు పద్మ పురస్కారాలు వరిస్తున్నాయి. అతి సామాన్య గిరిజనులు పద్మశ్రీ పొందడం చూస్తున్నాం. కాళ్లకు చెప్పులు లేని సామాన్యులు రాష్ట్రపతి భవన్‌కు వస్తున్నారు’’ అని అమిత్‌షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని