TS News: ఐఏఎంసీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది: సీజేఐ

 దేశంలో ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు

Updated : 18 Dec 2021 13:49 IST

హైదరాబాద్‌: దేశంలో ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రాన్ని(ఐఏఎంసీ) హైదరాబాద్‌లో జస్టిస్‌ ఎన్వీ రమణ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.

‘ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే కేసీఆర్‌ అంగీకరించారు. తక్కువ కాలంలో మంచి వసతులతో ఐఏఎంసీ ఏర్పాటైంది. మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. అతి తక్కువ వ్యయంతో స్వల్ప సమయంలో పరిష్కారమే లక్ష్యం. దేశంలో ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. ఐఏఎంసీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీని ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాల అనుకూలం. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర వహిస్తుంది’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తుంది: కేసీఆర్‌ 

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా హైదరాబాద్‌ పురోగమిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ను ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారని చెప్పారు. భాగ్యనగరాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ అని కేసీఆర్‌ వివరించారు. ఐఏఎంసీ ఏర్పాటులో సీజేఐ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అనేక రంగాల్లో హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా మారుతోందని కేసీఆర్‌ చెప్పారు. ఐఏఎంసీ.. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవచ్చని కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని