TS News: నేటితరం సినిమా రంగాన్ని సమీక్షించుకోవాలి: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

మన భాషా సంస్కృతులు క్రమంగా పడిపోతున్నాయని, ప్రభుత్వాలు కూడా తెలుగు భాష ఔన్నత్యానికి మద్దతివ్వట్లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

Updated : 04 Dec 2021 20:47 IST

హైదరాబాద్‌: మన భాషా సంస్కృతులు క్రమంగా పడిపోతున్నాయని, ప్రభుత్వాలు కూడా తెలుగు భాష ఔన్నత్యానికి మద్దతివ్వట్లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో ఘంటసాల శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఘంటసాల పురస్కారాన్ని గాయని పి.సుశీలకు ప్రదానం చేశారు.

జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ... ఘంటసాల పురస్కారం తన చేతుల మీదగా అందజేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.‘‘ఘంటసాల పాటలు మన జీవితాలతో పెనవేసుకున్నాయి. అనేక కష్టాలే ఘంటసాలను మానవతామూర్తిగా నిలిపాయి. తెలుగువీర లేవరా పాట వింటే ఎంతో భావోద్వేగం కలుగుతుంది.  తొలినాళ్లలో సినిమా రంగం బాధ్యతాయుతమైన పాత్ర పోషించింది. నేటి తరం సినిమా రంగాన్ని సమీక్షించుకోవాలి. సామాజిక స్పృహతో ఉన్న సినిమాలపైనే చర్చ జరుగుతుంది. నటీ నటుల తెలుగు ఉచ్ఛారణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని’’ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఎన్టీఆర్‌ను ‘మనదేశం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేసిన నటి, నిర్మాత కృష్ణవేణిని జస్టిస్‌ ఎన్వీ రమణ సన్మానించారు. ఈ సందర్భంగా పి.సుశీల తన మనసులోని మాటను వేదికపై వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ దగ్గరకు వెళ్లి తెలుగులో మాట్లాడాలని ఉందని, జస్టిస్‌ ఎన్వీ రమణే.. మోదీ దగ్గరకు తీసుకువెళ్లాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఏపీ మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని