CJI NV Ramana: తెలుగు సమాజం శాసించే శక్తిగా ఎదగాలి: సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

తెలుగు భాషను కాపాడుకునేందుకు ఉద్యమస్థాయిలో భాషావేత్తలు కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ‘వీధి అరుగు- దక్షిణాఫ్రికా

Updated : 28 Aug 2021 18:33 IST

దిల్లీ: తెలుగు భాషను కాపాడుకునేందుకు ఉద్యమస్థాయిలో భాషావేత్తలు కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ‘వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం’ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. మాతృభాష లేనిదే మనిషికి మనుగడ లేదన్న సీజేఐ ...ప్రతి ఒక్కరూ అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని పిలుపునిచ్చారు. ఆంగ్లం మోజులో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదని చెప్పారు.

‘‘కాలానుగుణంగా భాషలో మార్పు రాకపోతే ఆ భాష, సంస్కృతి పతనమైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. చైతన్యవంతమైన తెలుగు సమాజం తమ సుదీర్ఘ చరిత్రలో నేటి వరకు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు భాషలో దిద్దుబాట్లు, సర్దుబాట్లు చేసుకుంటూ మనుగడ కొనసాగించగలుగుతోంది. సంక్లిష్ట వచనా ప్రక్రియ నుంచి సరళమైన ప్రక్రియలోకి మహాప్రస్థానం సాగింది. ఈ ప్రస్థానంలో ముందు చూపుతో, తగు మార్పులతో ప్రగతిశీలకంగా భాషను మలచినటువంటి యుగపురుషులలో గిడుగు రామ్మూర్తి పంతులుగారు అగ్రగణ్యులు. సమకాలీకులైన గురజాడ వెంకటఅప్పారావుగారు, కందుకూరి వీరేశలింగం పంతులుగారు, గిడుగు రామ్మూర్తిగారి త్రయం సాహితీ, సామాజిక సంస్కరణలతో తెలుగు భాషను సామాన్య ప్రజల భాషగా మలిచారు. స్వాతంత్ర్యం సిద్ధించాక తెలుగు భాషలో తెలుగుదనాన్ని మళ్లీ ఎంతో చాకచక్యంగా ఉపయోగించి తెలుగు ప్రజలను ఆలోచింపజేసి  వారి అభిమానాన్ని చూరగొన్న ఘట్టం మాతరం వారందరం చూడగలిగాం’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వివరించారు.

‘‘నందమూరి తారకరామారావుగారు అగ్రశ్రేణి సినీనటుడిగా వెలుగొందడం వలనే ఆయన సులువుగా అధికారంలోకి రాగలిగారని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు కచ్చితంగా అనుకూలించాయి. అందులో సందేహం లేదు. కానీ,  నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉంది. ఊరారా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుతమైన ఉచ్ఛారణతో  అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన  ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర వహించింది. ఎందరో తారలను అందలమెక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు భాష పరిస్థితి దయనీయంగా ఉంది. తెలుగు సినిమా అర్ధం కావాలంటే ఇంగ్లీష్‌ లో సబ్‌ టైటిల్స్‌ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు భాషను కాపాడే బాధ్యత  ప్రసార మాధ్యమాలపై కూడా ఉంది. ఇకనైనా మేల్కొని దిద్దుబాటు  దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉంది.  కాపాడుకునేందుకు ఉద్యమ స్థాయిలో భాషాభిమానులందరూ సిద్ధం కావాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మన భాషను మలచుకుంటూ ... ప్రపంచ భాషల్లోని మంచిని సమ్మిళితం చేసుకుంటూ మన భాషను సుసంపన్నం చేసుకోవాలి. అదే సమయంలో తెలుగు మాధ్యమంలో చదవితే భవిష్యత్‌ ఉండదనే అపోహలు తొలగించాలి. డిగ్రీ వరకు నేను తెలుగు మాధ్యమంలోనే చదివాను. ఇంగ్లీషు అభ్యాసం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఉద్యోగ ధర్మం కనుక ఆంగ్లంలో అభ్యాసం, వాడకం కొనసాగిస్తున్నాను. పల్లెటూరిలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువుకుని ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. పాఠ్య పుస్తకాలు, విద్యాబోధన వ్యవహారికంలో కొనసాగడం నా లాంటి వారికి ఎంతో ఉపయోగపడింది. మనుషులంతా ఆలోచించేది మాతృ భాషలోనే.. ఆ మాతృభాషలో విద్యాబోధన కొనసాగితే కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పోటీని తట్టుకోవాలంటే ఇతర భాషలను, ప్రధానంగా ఆంగ్ల భాషను విస్మరించలేం. అలా అని ఆంగ్లం కోసం తెలుగును త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నాకంటే మెరుగైన వనరులున్నటువంటి ఈతరం వారు ఇంకెన్నో విజయాలను సాధించగలుగుతారు. ఆత్మ విశ్వాసం ముఖ్యం. తెలివి తేటలకు తెలుగువాడిలో కొదవలేదు. మన భాషే బలంగా తెలుగు సమాజం కూడా శాసించే శక్తిగా ఎదగాలనేదే నా ఆకాంక్ష ’’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.

సహజంగా జరగాల్సిన మాతృభాష పరిరక్షణ.. ప్రయత్న పూర్వకంగా చేయాల్సి రావడం శోచనీయమని ఈనాడు సంపాదకులు ఎం.నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికైనా భాషను బతికించుకుని భవిష్యత్‌ తరాలకు అందించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్దప్రసాద్‌, పలువురు భాషావేత్తలు సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని