
Dollar Seshadri: డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించుకోలేకపోతున్నా: జస్టిస్ ఎన్.వి.రమణ
శేషాద్రి పార్థివ దేహానికి నివాళులర్పించిన సీజేఐ
తిరుపతి: గుండెపోటుతో మృతిచెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి భౌతికకాయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ నివాళులర్పించారు. దిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీజేఐ.. నేరుగా తిరుపతిలోని డాలర్ శేషాద్రి నివాసం వద్దకు చేరుకుని పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.
అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ మీడియాతో మాట్లాడారు. డాలర్ శేషాద్రితో తనకు 25 ఏళ్ల అనుబంధముందని.. ఆయన లేని తిరుమలను ఊహించుకోలేకపోతున్నానని అన్నారు. శ్రీవారి సేవలోనే తుదిశ్వాస విడవటం శేషాద్రి అదృష్టమని చెప్పారు. స్వామి వారికి శేషాద్రి అత్యంత ప్రియమైన భక్తుడన్నారు. తిరుమల వచ్చినప్పుడల్లా చిరునవ్వుతో పలకరించి స్వామివారి దర్శనం చేయించేవారన్నారు. ఇకపై అలాంటి ఆహ్వానం ఉండదనేది తన మనసును కలచివేస్తోందని చెప్పారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు, తన కుటుంబసభ్యులకు ఎంతో నష్టమన్నారు. డాలర్ శేషాద్రి ఆత్మకు శాంతి కలగాలని.. శ్రీవారు ఆయనకు ముక్తిని ప్రసాదించాలని జస్టిస్ ఎన్.వి.రమణ ఆకాంక్షించారు. ఆలయ సంప్రదాయాలపై శేషాద్రి రచించిన పుస్తకాలను తితిదే వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అంతకుముందు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు కంచి పీఠం తరఫున వచ్చిన ప్రతినిధులు డాలర్ శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు. కాసేపట్లో తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో అంతక్రియలు జరగనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.