CM Jagan: పీఆర్సీపై ఉద్యోగులకు సీఎం జగన్‌ క్లారిటీ..

రాష్ట్రంలో ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనపై ఏపీ సీఎం జగన్‌ స్పష్టత ఇచ్చారు

Published : 03 Dec 2021 11:35 IST

తిరుపతి/ అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన సీఎం ఉద్యోగులను పిలిచి మాట్లాడారు. పీఆర్సీతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉద్యోగులు లేవనెత్తారు. దీనిపై స్పందించిన జగన్‌.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. పది రోజుల్లో ప్రకటన ఉంటుందని వారికి తెలిపారు.

డిమాండ్ల నెరవేర్చకుంటే ఆందోళన బాట
మరోవైపు పీఆర్సీ సహా ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. డిసెంబర్‌ 7 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు కార్యచరణ ప్రకటించిన నేపథ్యంలో చర్చలకు ఆహ్వానించింది. సచివాలయంలో కార్యదర్శుల కమిటీతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇవాళ సమావేశమయ్యారు. పీఆర్సీ నివేదికతో పాటు, డీఏ బకాయిలు, సీపీఎస్‌ రద్దు, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు, కారుణ్య నియామకాలపై ఉద్యోగ సంఘాలు చర్చిస్తున్నాయి. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తేనే చర్చలకు వీలు కలుగుతుందని అంటున్నాయి. తిరుపతిలో సీఎం జగన్‌ చేసిన ప్రకటన పట్ల తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపాయి. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకారం తెలియజేస్తేనే ఉద్యమ కార్యాచరణ విరమించుకుంటామని, లేనిపక్షంలో ఆందోళనకు వెళతామని ఉద్యోగ సంఘాలు స్పష్టంచేశాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని