CM Jagan: 26 నెలలుగా ప్రజారంజక పాలన అందిస్తున్నాం: జగన్‌

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Updated : 15 Aug 2021 16:59 IST

విజయవాడ: విజయవాడ: హక్కులు అందరికీ సమానంగా ఉండాలని.. హక్కులు, వాటి అమలు మధ్య తేడాలను రూపు మాపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనాన్ని ఆయన స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలను సీఎం జగన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించానని.. వివిధ వర్గాల ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దాన్ని చూశానన్నారు. ‘‘మన రైతులు వారి రెక్కలకు మరింత బలం కావాలని కోరుకున్నారు. అనేక కారణాలతో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు మంచి భవిష్యత్‌ ఉండాలని.. ఆత్మవిశ్వాసం నింపాలని కోరుకున్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన వాటా రావాలని కోరుకున్నారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మరింత అభివృద్ధిని కోరుకున్నారు’’ అని జగన్‌ చెప్పారు. 


గత ప్రభుత్వ బకాయిల భారాన్నీ చిరునవ్వుతోనే మోశాం

గత 26నెలలుగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నామని సీఎం చెప్పారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలను జగన్‌ ఈ సందర్భంగా వివరించారు. వ్యవసాయ రంగానికి రూ.83వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. ఒక్క ధాన్యం సేకరణ, కొనుగోళ్ల కోసమే రూ.33వేల కోట్లు ఖర్చు చేశామని.. ఇతర పంటలకు రూ.6వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, చెల్లించకుండా వదిలేసిన రూ.9వేల కోట్ల ఉచిత విద్యుత్‌, రూ.324 కోట్ల విత్తన బకాయిల భారాన్ని చిరునవ్వుతోనే మోశామన్నారు. ఏ సీజన్‌లో జరిగే నష్టానికి ఆ సీజన్‌లోనే పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26 నెలల్లో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలని ప్రజలకు సీఎం జగన్‌ సూచించారు. గ్రామ సచివాలయాల్లో 500పైగా పౌరసేవలతో దేశంలోనే సరికొత్త విప్లవానికి నాంది పలికామన్నారు. సూర్యోదయానికి ముందే 2.7లక్షల మంది వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని.. ఇంటికే వచ్చి పింఛను పంపిణీ చేసే వ్యవస్థ మన సొంతమని జగన్‌ చెప్పారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని