Updated : 28 Sep 2021 18:11 IST

Cm jagan: సహకార డెయిరీలను కొందరు తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారు

అమరావతి: చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పాడి రైతులకు ప్రయోజనం కలిగించే సహకార వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. దీనికోసం ఆక్వా హబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకువస్తున్నట్లు సీఎం ప్రకటించారు. జగనన్న అమూల్‌ పాల వెల్లువ, మత్స్య శాఖలపై అధికారులతో జగన్‌ సమీక్షించారు. పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులు, అమూల్‌ ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు.

‘‘గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారు. కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారు. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారు. అమూల్‌ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలు తప్పక ధరలు పెంచాల్సి వచ్చింది. లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకూ అదనపు ఆదాయం సమకూరింది. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుంది. మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నాం. తమ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో.. చాలా మంది మహిళలు పాడిపరిశ్రమను ఎంచుకున్నారు. వీరికి మరింత చేయూత నివ్వడానికి  బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల(బీఎంసీయూ)ను నిర్మిస్తున్నాం. మహిళలు పాడి వ్యాపారంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలి. దీనివల్ల మహిళలకు మరింత ప్రయోజనం జరుగుతుంది. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుంది. తద్వారా గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థ బలోపేతం కావాలి’’ అని సీఎం జగన్‌ వివరించారు.

రైతులను దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం..

‘‘ప్రజలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేందుకు ఆక్వాహబ్‌లు, రిటైల్‌ వ్యవస్థలను తీసుకు రావాలని నిర్ణయించాం. సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్‌ అయ్యి రేట్లు తగ్గిస్తున్నారు. దీనికి పరిష్కారంగా ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్‌ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోంది. పౌష్టికాహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, మత్స్య ఉత్పత్తులకు స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించాలి. రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలి. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు ఫీడ్, సీడ్‌లో నాణ్యత కోసం, రైతులను దోచుకునే విధానాలను అడ్డుకోవడం కోసం కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చాం. చట్టాన్ని అధికారులు పటిష్టంగా అమలు చేయాలి. ఆక్వారంగానికి ఇచ్చే రాయితీలు నేరుగా రైతులకు అందాలి’’ అని జగన్‌ అన్నారు.

అందుబాటులోకి 75 నుంచి 80 హబ్‌లు, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్లు..

ఆక్వాహబ్‌లు, అనుబంధ రిటైల్‌ దుకాణాల ద్వారా దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 26 నాటికి దాదాపు 75 నుంచి 80 హబ్‌లు, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్లను సిద్ధం చేస్తామని వివరించారు. 10 ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. దీనివల్ల మార్కెట్లో సిండికేట్‌కు చెక్‌ పెట్టగలుగుతామని.. రైతులకు మంచి ధరలు వస్తాయని అధికారులు సీఎంకు వివరించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని