Ap News: ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా మరింత కఠినంగా ఆంక్షలు: సీఎం జగన్‌

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు

Updated : 13 Dec 2021 17:04 IST

అమరావతి: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్యారోగ్య శాఖపై సమీక్షించిన సీఎం జగన్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరో వారం రోజుల్లో జీన్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఫీవర్‌ సర్వే కొనసాగిస్తామని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ నెలాఖరు నాటికి 144 పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జనవరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ  డబుల్‌ డోస్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడమే కొవిడ్‌ నివారణకు ఉన్న మార్గమని సీఎం అభిప్రాయపడ్డారు.

‘‘ఆరోగ్యశ్రీ సేవలను సమర్థంగా ఉపయోగించుకొనేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యాప్‌ ద్వారా ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. క్యాన్సర్‌ రోగులకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించాలి. మూడు ప్రాంతాల్లో కనీసం మూడు స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులో ఉండాలి. దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రోగులకు ఉండదు. క్యాన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించాలి. ఆస్పత్రుల్లో పెట్టిన ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేయాలి. రోగులకు సమర్థంగా సేవలు అందేలా వ్యవస్థను రూపొందించాలి. 108, 104 వాహనాలు అత్యంత సమర్థంగా ఉండాలి. నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదు. సేవలు అందించడంలో వాహనాల నిర్వహణ ఎంతో కీలకం. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని బఫర్‌ వెహికల్స్‌ పెట్టుకొని ఎప్పటికప్పుడు వాహనాల నిర్వహణ చూసుకోవాలి’’ అని సీఎం తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకంపై సీఎం జగన్‌ ఆరా తీశారు. ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య, వైద్యులు సహా సిబ్బంది సంఖ్యను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తోన్న సేవలపట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం కలిగేలా ఆస్పత్రులను తీర్చిదిద్దాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని