Cm jagan: కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి: సీఎం జగన్‌

కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ చర్యల...

Published : 18 Oct 2021 18:52 IST

అమరావతి‌: కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలన్నారు. నవంబరు 30వ తేదీలోగా కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లాల కేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. ఆస్పత్రుల్లో ఖాళీలపై నియామక క్యాలెండర్‌ను రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. జాతీయ ప్రమాణాల ప్రకారం ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.  176 కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

బొగ్గు సరఫరా, విద్యుత్‌పై ప్రణాళిక, దీర్ఘకాలిక వ్యూహాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణలోని సింగరేణి, కోల్‌ఇండియాతో సమన్వయం చేసుకోవాలని.. బొగ్గు తీసుకొచ్చే ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలపై దృష్టి పెట్టాలన్నారు. పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తోందని అధికారులు తెలిపారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని సీఎం ఆదేశించారు. సీలేరులో ప్రతిపాదిత 1,350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలన్నారు. 6,300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ ఉత్పత్తి, ప్రాజెక్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని