Updated : 19 Nov 2021 00:33 IST

Cm jagan: ఏపీలో భారీ వర్షాలు.. శిబిరాల్లో ఉన్న వారికి రూ.వెయ్యి తక్షణ సాయం

అమరావతి: ఏపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షంతో కనుమదారులు మూసేయడంతో తిరుమలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడపలో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది.  ఈనేపథ్యంలో భారీ వర్షాలు.. సహాయక చర్యలపై సీఎం జగన్‌ నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్లు , చెరువుల్లో నీటిమట్టాలు గమనించాలని అధికారలకు సూచించారు. తిరుపతిలో పరిస్థితిపై చిత్తూరు కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం... అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

శిబిరాల్లో ఉన్న వారికి రూ.వెయ్యి తక్షణ సాయం

‘‘సహాయక శిబిరాల్లో వసతులు ఉండేలా చూడాలి. శిబిరాల్లో ఉన్నవారికి రూ.వెయ్యి తక్షణ సహాయం ఇవ్వాలి. తిరుపతిలో సహాయక చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలి. సిబ్బదిని అందుబాటులో ఉంచుకోవాలి. వైద్యారోగ్యసిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు నిధులు ఉన్నాయి. నిధుల కోసం రాజీపడాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు ఇవ్వాలి. ఏం కావాలన్నా వెంటనే తెలపండి.. నిరంతరం అందుబాటులో ఉంటా. శాఖాధిపతులు పరిస్థితుల మేరకు చర్యలు తీసుకోవాలి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాలి’’ అని సీఎం ఆదేశించారు.

నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతుందని, నేటి ఉదయానికి చెన్నై- పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

కడప జిల్లాలో భారీ వర్షం.. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద 
కడప: కడప జిల్లాలో భారీ వర్షం కరుస్తోంది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాయచోటీలో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్ట్‌లకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. వరదనీటితో మాండవ్య నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో మంచాలమ్మ గండి చెరువు ప్రమాదకరంగా మారింది. రాయచోటిలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సుండుపల్లి మండలంలో పింఛా ప్రాజెక్ట్‌ కట్టకు భారీగా వరద వస్తోంది. లక్ష క్యూసెక్కుల వరద ప్రాజెక్ట్‌కు వస్తోంది. దీంతో అధికారులు 5 గేట్ల ద్వారా 48 వేల క్యూసెక్కులు కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ కట్ట తెగే ప్రమాదం ఉందన్ని అధికారులు చెబుతున్నారు. దిగువన ఉన్న అన్నమయ్య ప్రాజెక్ట్ భద్రతపై అధికారులు అప్రమత్తమయ్యారు. వెలిగల్లు ప్రాజెక్ట్‌ నుంచి 20 వేల క్యూసెక్కులు పాపాగ్ని నదికి విడుదల అవుతోంది. 

చక్రాయపేట, వేంపల్లి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. చక్రాయపేట మండలం చెరువుకాంపల్లి చెరువు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చెరువుకాంపల్లి, కుమారకాల్వ, హరిజనవాడ, అద్దాలమర్రి వాసులు భయాందోళనలో ఉన్నారు. గ్రామాల్లోని గొర్రెలు, మేకలు, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వరదతో పాపాగ్ని నది అద్దాలమర్రి వద్ద వంతెనపై నుంచి ప్రవహిస్తోంది. వేంపల్లెలోని లోతట్లు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పులివెందుల మండలం మొట్నూతల పల్లెను వరద ముంచెత్తింది. యర్రబల్లి చెరువుకు వరద నీరు పోటెత్తింది. నీరు ఎక్కువ కావడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లాలో వరద పరిస్థితి కలెక్టర్‌, అధికారులు పరిశీలిస్తున్నారు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని