Ap News: ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి: సీఎం జగన్‌

ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఏపీ సీఎం జగన్‌ కోరారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు....

Updated : 06 Jan 2022 19:40 IST

అమరావతి‌: ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఏపీ సీఎం జగన్‌ కోరారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను నోట్‌ చేసుకున్నట్లు సీఎం చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని.. ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని.. మంచి చేయాలనే తపనతోనే ఉన్నట్లు సీఎం వివరించారు. రెండు మూడు రోజుల్లో పీఆర్‌సీపై ప్రకటన చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు.

71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. దీనిపై సీఎస్‌, ఇతర అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. వీటిలో ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్‌ చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా సంఘాల నేతలు సీఎంను కోరుతున్నారు. ఉద్యోగులు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల సీఎస్‌ కమిటీ 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. తమకు 55 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తేనే ఆమోదయోగ్యంగా ఉంటుందని పునరుద్ఘాటించాయి. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ ఉద్యోగులు వెనక్కితగ్గలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో చర్చలు జరిపాయి.

ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలి: ఉద్యోగ సంఘాలు

సీఎం జగన్‌తో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘11వ వేతన సవరణ సంఘం నివేదికపై చర్చలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆర్థిక శాఖ కార్యదర్శి వివరించారు. గత ఆర్థిక సంఘం ఇచ్చిన ఫిట్‌మెంట్‌లపై వివరించారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టితో పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. 2010లో వేతన సవరణ సంఘం వేతనాలపై అధ్యయనం చేసింది. నాడు 27 శాతం సిఫార్సు చేస్తే నాటి ప్రభుత్వం 39 శాతం ఇచ్చింది. 2010లోనే వేతనాల పెరుగదల శాస్త్రీయంగా జరిగింది. ఇక 2022లో ఎంత శాతం వేతనాలు పెంచాలో ఆలోచించాలని సీఎంని కోరాం. పింఛన్‌దారులకు ఉన్న రాయితీని తగ్గించే ప్రతిపాదనలు అంగీకరించవద్దని చెప్పాం. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించలేదు. వారి జీతభత్యాలను పెంచలేదు. వారి వేతనాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరాం. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది జీతాలు పెరగాల్సి ఉంది. ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం’’ అని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని