Cm Jagan: 46వేల కి.మీ. రోడ్ల మరమ్మతులపై దృష్టి: సీఎం జగన్‌

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల కిలోమీటర్ల మేర

Updated : 15 Nov 2021 20:13 IST

అమరావతి: రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల పనులను వెంటనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేపట్టాలని.. విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎన్‌డీబీ ప్రాజెక్టుల్లో టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని సీఎం ఆదేశించారు. రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణపై సీఎం జగన్ సమీక్షించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పలు శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

రాష్ట్రంలో రహదారులపై ముందుగా గుంతలు పూడ్చి, ఆ తర్వాత కార్పెటింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు. అన్ని రోడ్ల మీద అన్ని చోట్లా గుంతలు పూడ్చాలని సూచించారు. ఈ మేరకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రత్యేకించి కొన్ని రోడ్లు అని కాకుండా రాష్ట్రం మొత్తం చేయాలని.. ఎక్కడా ఒక చిన్న గుంత కూడా కనిపించకూడదన్నారు. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా రోడ్ల మరమ్మతుల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఏ కేటగిరీ అయినా సరే 46 వేల కిలోమీటర్లు వెంటనే రిపేర్‌ చేయాలని.. ఎక్కడా గుంతలు ఉండటానికి వీల్లేదన్నారు. రోడ్ల మరమ్మతులు చేసిన తర్వాత తేడా కనిపించాలని, తర్వాత మరొకరు విమర్శించే అవకాశం ఉండకూడదన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి చేసి 8,268 కిలోమీటర్లు రోడ్ల మరమ్మతులు వెంటనే మొదలు పెడతామని అధికారుల వెల్లడించారు. 46 వేల కిలోమీటర్లు మొత్తం ఒక యూనిట్‌గా తీసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ వెంటనే మరమ్మతులు చేయాలని సీఎం చెప్పారు. వర్షాలు తగ్గగానే డిసెంబర్‌ నుంచి జూన్‌ వరకు అన్ని రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

‘‘అన్ని వంతెనలు, ఫ్లై ఓవర్‌లు, ఆర్‌వోబీలను ఫేజ్‌-1 పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలి. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్టుల టెండర్లలో పాల్గొని కాంట్రాక్ట్‌లు పొందిన కాంట్రాక్టర్‌లు పనులు ప్రారంభించకపోతే వారిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలి. దీనిపై అధికారులు సీరియస్‌గా స్పందించాలి. వారంలోపు పనులు ప్రారంభించకపోతే బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామంటూ నోటీసులు జారీ చేయండి. నాడు-నేడు తరహాలో ముందుగా రోడ్లు రిపేర్‌ చేసేముందు, మరమ్మతులు చేసిన తర్వాత ఫొటోలు తీయాలి. కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందుగా రిపేర్లు, మెయింటెనెన్స్‌ మీద దృష్టి పెట్టాలి. నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి. 2022 జూన్‌ నాటికి రాష్ట్రంలో రహదారులన్నింటి మరమ్మతులు పూర్తి కావాలి’’ అని సీఎం ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు