CM Jagan: కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ పురస్కారాలు: జగన్‌

వివిధ రంగాల్లో సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డుల తరహాలో రాష్ట్రంలోనూ అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని..

Updated : 01 Nov 2021 17:23 IST

అమరావతి: వివిధ రంగాల్లో సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మ అవార్డుల తరహాలో రాష్ట్రంలోనూ అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగా రాష్ట్రంలోనూ అవార్డులు ఇస్తే బాగుంటుందని పలు సూచనలు అందాయని చెప్పారు. అన్నదాతలు, విద్యార్థులు, ప్రతి పేదవాడి కోసం దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి పనిచేశారని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైఎస్సార్‌ సాఫల్య, వైఎస్సార్‌ జీవన సాఫల్య పురస్కారాలను ప్రకటించినట్లు సీఎం వెల్లడించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కలిసి జగన్‌ పాల్గొన్నారు. మొత్తం 29 మందికి వైఎస్సార్‌ జీవన సాఫల్య, 30 మందికి వైఎస్‌ఆర్‌ సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు.

పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయానికి ఇస్తున్న గౌరవం ఇది అని చెప్పారు. వైఎస్సార్‌ జీవన సాఫల్య పురస్కారానికి రూ.10లక్షల నగదు, కాంస్య ప్రతిమ, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారానికి రూ.5లక్షల నగదు, కాంస్య ప్రతిమ అందజేస్తున్నామన్నారు. అవార్డుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూడలేదని.. కేవలం మానవత, సేవ, ప్రతిభను గుర్తించి ఎంపిక చేశామని చెప్పారు. వీధి నాటకం, తోలుబొమ్మలు, కూచిపూడి నృత్యం, జానపదం, సేవలు, అన్నదాతలు..ఇలా వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలు ఇస్తున్నామని జగన్‌ తెలిపారు.  ఇకపై ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రదానం చేస్తామని సీఎం చెప్పారు.

వైఎస్సార్‌ విశేష కృషి చేశారు: గవర్నర్‌

వైద్య వృత్తి చేసి వ్యవసాయానికి, విద్యారంగానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విశేష కృషి చేశారని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతి, సంప్రదాయం ఎంతో విశిష్టమైనదని చెప్పారు. దేశ భాషల్లో తెలుగు ఎంతో తీయనైనదంటూ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర అవతరణ కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించి ఈ పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నానని గవర్నర్‌ చెప్పారు. గుర్తింపు పొందని పలు రంగాలకు చెందిన విశిష్ఠ వ్యక్తులకు అందుతున్న అవార్డులుగా వైఎస్సార్‌ పురస్కారాలను భావిస్తున్నానన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని గవర్నర్‌ చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్‌లోనూ రాష్ట్రం క్రియాశీలకంగా ఉందన్నారు. కరోనా వారియర్స్‌కి ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్నాథుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని