Konijeti Rosaiah: రోశయ్య పదవులకు వన్నె తెచ్చారు: సీఎం కేసీఆర్‌

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Updated : 04 Dec 2021 14:10 IST

హైదరాబాద్‌: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు చెప్పారు. రోశయ్య మరణవార్త తనను ఎంతగానో బాధించిందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా.. సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జగన్‌ వివరించారు.    

రోశయ్య కుటుంబ సభ్యులు, అభిమానులకు తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా రోశయ్య పేరుప్రఖ్యాతలు గడించారని చెప్పారు. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్‌ స్థాయికి ఎదిగారని కొనియాడారు. అప్పగించిన ఏ బాధ్యత అయినా సమర్థంగా నిర్వహించేవారని చంద్రబాబు తెలిపారు.

రోశయ్య మృతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలన్నారు. నీతి నిజాయతీ, నిబద్ధత, ప్రజా సేవ పట్ల అంకితభావం, సిద్ధాంతాల ఆచరణలో రోశయ్య పెట్టింది పేరని రేవంత్‌ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయాల్లో ఓ శకం ముగిసింది..

‘‘ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత. విలువలు, సంప్రదాయాలు కాపాడటంలో రుషి మాదిరి సేవ చేశారు. రోశయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. వివాద రహితులుగా, నిష్కళంకితులుగా మన్ననలు పొందారు’’ - సినీ నటుడు చిరంజీవి

‘‘రోశయ్య మరణం సమకాలిక రాజకీయాలకు తీవ్రమైన నష్టం. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నిర్వర్తించిన పాత్ర వర్ణనాతీతం. ఏ సీఎం దగ్గర పని చేసినా రోశయ్య తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్థిక శాఖలో అత్యుత్తమ సేవలు అందించారు. ఆయన అకాల మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’’ - ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు

‘‘రోశయ్య శివైక్యం చెందడం కలచివేసింది. విశాఖ శ్రీ శారదాపీఠంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఆధ్యాత్మికతకు రోశయ్య అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఆయన తపించారు. రోశయ్య రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం’’ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి

ఉమ్మడి ఏపీ సీఎంగా, తమిళనాడు, కర్ణాటక గవర్నర్లుగా పని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రోశయ్య. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసే రోశయ్య ఇక లేరన్న వార్త బాధిస్తోంది. రోశయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.-మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు

‘‘ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం బాధాకరం. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా అనేక పదవులు అలంకరించి, అమూల్యమైన సేవలు అందించారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆర్థికమంత్రిగా దేశంలోనే ఎక్కువ సార్లు రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు నెలకొల్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి ఎంతో కృషి చేశారు’’ - కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్

‘‘రోశయ్య అందరి వాడు. దేశంలో రాజకీయాలకు అతీతంగా అభిమానించే నేతల్లో ఆయన ఒకరు. ఆయన మృతితో ఓ రాజకీయ ధృవతార రాలిపోయింది. రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు’’ - ఎంపీ టీజీ వెంకటేశ్‌

‘‘రాజకీయాల్లో రోశయ్య సేవలు భావితరాలకు స్ఫూర్తి. అజాత శత్రువు రోశయ్య పేరిట మెమోరియల్ ఏర్పాటు చేయాలి. ఈ విషయంపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తా. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ స్వయంగా ఫోన్‌ చేసి రోశయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఏఐసీసీ బృందం రేపు రోశయ్య అంత్యక్రియలకు హాజరవుతుంది’’ - కాంగ్రెస్ సీనియర్‌ నేత వీహెచ్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని