Dalit Bandhu: ‘దళిత బంధు’ గొప్ప సందేశమిచ్చే పథకం: కేసీఆర్‌

హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. స్వయంగా రంగంలోకి దిగిన సీఎం.. నేతలు, ప్రజలతో మాట్లాడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా

Published : 24 Jul 2021 16:51 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్ ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. స్వయంగా రంగంలోకి దిగిన సీఎం.. నేతలు, ప్రజలతో మాట్లాడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ‘దళిత బంధు’ పథకం గురించి కేసీఆర్ ఆయనతో మాట్లాడారు.

‘‘దళిత బంధు ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ఇలాంటి పథకం ఎక్కడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హుజూరాబాద్‌లో ప్రతి గ్రామంలో ఈ పథకం గురించి వివరించాలి. దళిత జాతి చాలా గొప్పది. దేశానికి, ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చే పథకం ఇది. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుంది. ఈ పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలి. హుజూరాబాద్‌లో ఈ పథకం విజయంపై ఎస్సీల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ నెల 26న హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని వారు ప్రగతిభవన్‌కు రావాలి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు’’ అని ఫోన్‌లో కేసీఆర్‌ వివరించారు. సీఎం కేసీఆర్‌ నుంచి స్వయంగా ఫోన్‌ రావడంతో రామస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 26న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 412 మంది ఎస్సీలతో ప్రగతి భవన్‌లో దళితబంధు పథకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని