Ramappa Temple: రామప్పకు యునెస్కో గుర్తింపుపై కేసీఆర్‌ హర్షం

ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించడం చాలా ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా..

Updated : 25 Jul 2021 19:22 IST

హైదరాబాద్: ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించడం చాలా ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రామప్పను వారసత్వ సంపదగా గుర్తించిన యునెస్కో సభ్యత్వ దేశాలు, ఇందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. గుర్తింపు లభించేందుకు కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.

రామప్ప ఆలయానికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప కావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి బహుమతి: బండి సంజయ్‌

చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించడం హర్షదాయకమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహాయ సహకారాలతోనే రామప్పకు ఈ గుర్తింపు వచ్చిందన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మొదటి బహుమతిగా భావిస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరెన్నో తెలంగాణకు కిషన్ రెడ్డి కల్పిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం ద్వారా తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.

తెలుగుజాతికే గర్వకారణం: ఎర్రబెల్లి

రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు దక్కడం ఎంతో సంతోషకరమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రామప్ప ఆలయానికి ఈ గుర్తింపు లభించడం తెలుగు జాతికే గర్వకారణంగా ఉందన్నారు. రామప్ప అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని.. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపించారని పేర్కొన్నారు. గుర్తింపు దక్కేందుకు కృషి చేసిన మంత్రులు, అధికారులకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.

పర్యాటక ప్రాంతంగా తెలంగాణ: శ్రీనివాస్‌గౌడ్‌

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం సంతోషకరమని తెలంగాణ పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరిన్ని ప్రదేశాలు యునెస్కో గుర్తింపు పొందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ‘‘ తెలంగాణ చరిత్ర, చారిత్రక కట్టడాలు, సంపద, సాంప్రదాయాలను ప్రపంచమంతా చాటిచెప్పాలంటే స్వరాష్ట్ర సాధనతోనే సాధ్యమని సీఎం కేసీఆర్‌ నమ్మారు. తెలంగాణ విశిష్టత ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియకపోవడానికి గత పాలకులే కారణం. నేడు సీఎం కేసీఆర్‌ కృషితో ప్రఖ్యాత రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నస్టం ఏమిటో ఇప్పుడు అందరికీ అర్ధం అవుతుంది. యునెస్కో గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన రెండేళ్లలోనే గుర్తింపు వచ్చింది. పర్యాటక రంగంలో ఇదో కీలక అడుగు. పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 10 ప్రాంతాలు ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందే స్థాయిలో ఉన్నాయి. వాటన్నింటికీ గుర్తింపు లభించేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని