Updated : 15 Aug 2021 17:00 IST

CM KCR: రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ: కేసీఆర్‌

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌: స్వాతంత్ర్య పోరాట ఉజ్వల ఘట్టాలను దేశం స్మరించుకుంటోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. 75వ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. స్వాతంత్ర్య ఫలాలను సమీక్షించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందన్నారు.

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణది ప్రథమ స్థానం

‘‘అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధిని ఆవిష్కరించాం. ప్రగతిఫలాలు ప్రజల అనుభవంలోకి వచ్చాయి. విద్యుత్‌, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాం. విద్యుత్‌, సాగు, తాగునీటి రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శం. ఏడేళ్లలో స్థిర ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 2013-2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4,51,580 కోట్లు. 2020-21లో అది రూ.9,80,407 కోట్లు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. 2013- 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,12,126. నేడు అది రూ.2,37,632. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపుగా ఉంది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. విద్యుత్‌ కష్టాలకు చరమగీతం పాడి తెలంగాణ చరిత్రకెక్కింది. అన్ని రంగాలకూ 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ సామర్థ్యం 7,788 మెగావాట్లు. ప్రస్తుతం 16,425 మెగావాట్లకు పెరిగింది. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్రానిది దేశంలో 2వ స్థానం. రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 2012 యూనిట్లుకు పెరిగింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రానిది దేశంలోనే మొదటి స్థానం. నల్గొండ జిల్లాలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ అతిపెద్ద ఆల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌’’ అని సీఎం చెప్పారు. 

ఇది రైతుల ప్రభుత్వం..

వ్యవసాయ రంగంలో అసాధారణ అభివృద్ధి సాధించామని కేసీఆర్‌ అన్నారు. 3.40 కోట్ల దిగుబడితో దేశంలోనే అగ్రస్థానం సాధించామని చెప్పారు. ‘‘రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 20 శాతం. దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగింది. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా రాష్ట్రం అవతరించింది. 2013-14లో రాష్ట్రంలో 49లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తే.. 2020-21లో కోటి 6లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. 60.54లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతోంది. పత్తి సాగులో దేశంలోనే రాష్ట్రానిది రెండో స్థానం. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో రాష్ట్రం 56 శాతం అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేస్తాం. 3లక్షల మంది రైతులకు రూ.25వేల వరకు.. 6లక్షల మంది రైతులకు రూ.50వేల లోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నాం. ఇది రైతుల ప్రభుత్వం. కొత్త భూపరిపాలన విధానంతో ధరణి వ్యవస్థను తీసుకొచ్చాం.

త్వరలో చేనేత బీమా

సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని సృష్టిస్తోంది. వృద్ధాప్య పింఛను అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించాం. త్వరలో రైతు బీమా తరహాలో చేనేత బీమా పథకం తీసుకొస్తాం. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తాం. కరోనా కష్టాలను అధిగమించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ కొవిడ్‌ వైద్య కేంద్రాల్లో 27,996 పడకలు అందుబాటులో ఉన్నాయి. 17, 114 పడకలను ఆక్సిజన్ పడకలుగా అభివృద్ధి చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ కేంద్రాల్లో 50కిపైగా వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. హైదరాబాద్‌ పరిధిలో 224 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. దేశంలో తొలిసారి ప్రసూతి ఐసీయూ వార్డులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా మరో 8 వైద్యకళాశాలలు మంజూరు చేశాం’’ అని కేసీఆర్‌ వివరించారు. 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని