CM KCR: 10 అంశాలపై ప్రధానికి లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశం ముగిసింది. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ఇవాళ ప్రధాని మోదీతో దాదాపు 50 నిమిషాల పాటు

Updated : 03 Sep 2021 20:12 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రానికి జౌళి పార్కు, గిరిజన విశ్వవిద్యాలయం, ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. ఈమేరకు ప్రధానితో సమావేశమైన కేసీఆర్‌ .. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పది అంశాలపై కేసీఆర్‌... ప్రధానికి వినతి పత్రాలు అందించి వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. దిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రధానిని కోరిన కేసీఆర్‌ ... యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ అభ్యర్థనలపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలని, కరీంనగర్‌లో ట్రిపుల్‌ ఐటీ, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారు. ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ చేసి.. అవకాశం ఉన్నమేరకు రాష్ట్రానికి కొత్త ఐపీఎస్‌లను కేటాయించాలని విన్నవించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు జౌళి పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేయాలని, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని, పీఎంజీఎస్‌వైకు అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ ప్రధానికి లేఖలు అందజేసినట్టు సీఎంఓ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని