Cm Kcr: రోజుకు 3 లక్షల కొవిడ్‌ టీకాలిచ్చేలా స్పెషల్‌ డ్రైవ్‌: సీఎం కేసీఆర్

తెలంగాణలో రోజుకు 3 లక్షల కొవిడ్‌ టీకాలు ఇచ్చేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Updated : 12 Sep 2021 23:20 IST

హైదరాబాద్: తెలంగాణలో రోజుకు 3 లక్షల కొవిడ్‌ టీకాలు ఇచ్చేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వ్యవసాయం, వైద్యారోగ్యంపై ఆ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోందని, రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్‌ సరఫరా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో కరోనా ప్రభావం అంతగా లేదని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. 

వ్యాక్సినేషన్‌పై కలెక్టర్లతో సీఎస్ తరచూ సమీక్షలు జరపాలని సీఎం ఆదేశించారు. టీకా సెంటర్లుగా విద్యా సంస్థలు, రైతు వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించగానే అప్రమత్తమైన వారు త్వరగా కోలుకున్నారని.. నిర్లక్ష్యం చేసిన వారే ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయని సీఎం అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లు, పడకల ఏర్పాటుపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చామని.. ఇకపై వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంపై శ్రద్ధ వహించాలన్నారు. నిమ్స్‌ పరిధిలో మరో రెండు టవర్లు నిర్మించి వైద్య సేవలు పెంచాలని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. హైదరాబాద్‌ సమగ్ర అభివృద్ధి, జీఓ 111పై సీఎం సమీక్ష నిర్వహించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని