CM Kcr: ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

జిల్లాల కలెక్టర్లు, సీనియర్‌ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు...

Updated : 18 Dec 2021 19:20 IST

హైదరాబాద్‌: జిల్లాల కలెక్టర్లు, సీనియర్‌ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, ధాన్యం సేకరణ, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్తజోనల్‌ విధానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అందుకనుగుణంగానే ఉద్యోగుల విభజన  ప్రక్రియ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల విభజన, కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో దీనిపై కేసీఆర్‌ సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయితే అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ పాలన సజావుగా సాగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించే వెసులుబాటు కూడా లభిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

అందుకనుగుణంగా విభజన ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకునే ప్రక్రియ పూర్తయింది. ఈనెల 20న ఉద్యోగులకు కొత్త జిల్లాల వారీగా విభజన ప్రక్రియ పూర్తి చేసి కేటాయింపులు చేయనున్నారు. ఆ కేటాయింపుల తర్వాత వారం రోజుల్లోగా వారంతా విధుల్లోకి చేరాల్సి ఉంటుంది. వెనుకబడిన మారుమూల జిల్లాల్లో పాలన అందరికీ చేరాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని,  ఉద్యోగులు మారుమూల గ్రామాల్లోకి వెళ్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం స్పష్టం చేశారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారు ఒకే చోట పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో ..స్థానిక యువతకు ఉపాధిఅవకాశాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా స్పౌస్‌ కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త జోనల్‌ వ్యవస్థతో ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలో అమలవుతుందని సీఎం పేర్కొన్నారు.

యాసంగిలో కిలో వడ్లు కూడా కొనేది లేదు: కేసీఆర్‌

యాసంగిలో కిలో వడ్లు కూడా కొనేది లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. కలెక్టర్ల సమావేశంలో వ్యవసాయంపై చర్చ సందర్భంగా సీఎం ఈవిషయాన్ని స్పష్టం చేశారు.  కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ధాన్యం కొనబోమనే విషయాన్ని వివరించాలని కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలదేని సీఎం అన్నారు. వీటిని ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల సాగుదిశగా  రైతులను సమాయత్తం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని