TS NEWS: వాసాలమర్రి వాసులకు కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం: కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎం..

Updated : 04 Aug 2021 20:47 IST

వాసాలమర్రి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లాలో దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకున్న సీఎం.. అధికారులతో కలిసి అక్కడి దళితవాడలో పర్యటించారు. స్థానికంగా ఉన్న 60 దళిత కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ ఎన్నో పోరాటలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఈ ఆరేళ్లలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. విద్యుత్‌, తాగునీరు, సాగునీరు సమస్య తీరింది. కులవృత్తులపై ఆధారపడిన వారిని ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నాం. ప్రభుత్వ పథకాలు తెచ్చినా వాటిపై ప్రజల్లో అవగాహన కొరవడింది. కరోనా వల్ల రాష్ట్రం ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గడం వల్ల కొన్ని పథకాల ఆమలు పెండింగ్‌లో ఉంది. ఏదేమైనా దళితబంధు పథకం అమలు చేసి తీరుతాం. ఇల్లు లేని వారికి రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రభుత్వ భూమిని నిరుపేద ఎస్సీలకు ఇస్తాం. వాసాలమర్రి గ్రామంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో ఎర్రవల్లి గ్రామం పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉండేది. ఎర్రవల్లిలో ఇళ్లన్నీ పడగొట్టి కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చాం. గ్రామస్థులను 6 నెలలు గుడారాల్లో ఉంచి ఇళ్లు నిర్మించి ఇచ్చాం. వాసాలమర్రిలో కూడా అదే విధంగా కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

గ్రామంలోని 76 కుటుంబాలకు ‘దళితబంధు’


 

వాసాలమర్రి గ్రామంలోని 76 ఎస్సీ కుటుంబాలకు దళితబంధు పథకం మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రామంలోని అందరికీ ఒకే విడతలో దళిత బంధు నిధులు పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో రేపు నిధులు జమచేస్తాం, ఎలా ఖర్చు చేసుకుంటారో వారి ఇష్టమని సీఎం అన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా ఉపాధి పెరిగే మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ప్రతి లబ్ధిదారుని వద్ద రూ.10వేలు చొప్పున ప్రభుత్వం తీసుకుంటుందని, ఆ డబ్బులతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీలలో ఎవరికి ఆపద వచ్చినా.. దళిత రక్షణ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వాసాలమర్రిలో ఎస్సీల కమతాల ఏకీకరణ కూడా జరగాలన్నారు. గ్రామంలో ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ఉందని, ప్రభుత్వ మిగులు భూమిని ఎస్సీ కుటుంబాలకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని