Power Bill: సాధారణ కూలీకి కరెంటు బిల్లుతో గుండె గుబేల్‌!

వారిదో పేద కుటుంబం.. కూలికెళ్తేగానీ కడుపు నిండదు.. పింఛన్  వస్తే తప్ప సంసారం సాగదు. కాలక్షేపానికి ఇంట్లో ఓ చిన్న టీవీ.. ఉక్కపోస్తే ఒక ఫ్యాన్! ..

Updated : 27 Aug 2021 12:12 IST

ఉరవకొండ: వారిదో పేద కుటుంబం.. కూలికెళ్తేగానీ కడుపు నిండదు.. పింఛన్  వస్తే తప్ప సంసారం సాగదు. కాలక్షేపానికి ఇంట్లో ఓ చిన్న టీవీ.. ఉక్కపోస్తే ఒక ఫ్యాన్! చీకటి పడ్డాక వెలుగుల కోసం రెండు లైట్లు.. ఆ మాత్రానికే విద్యుత్‌ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. గుండె గుబేల్‌ మనేట్టుగా కరెంటు బిల్లు పంపారు. 

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామానికి చెందిన పర్వతప్ప సాధారణ కూలి. ఆయన ఇంట్లో మూడు బల్బులు, టీవీ, ఫ్యాన్‌ ఉన్నాయి. ప్రతి నెలా కరెంట్‌ బిల్లు రూ.200- 300 మధ్య వచ్చేది. కానీ ఈ మధ్య ఓసారి ఏకంగా రూ.1,48,371 రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనిపై పలుమార్లు విద్యుత్‌శాఖ సిబ్బంది చుట్టూ తిరిగితే రూ.56,399కి తగ్గించి కట్టాలని చెబుతున్నారని.. కానీ తాము అంత బిల్లు చెల్లించలేమని పర్వతప్ప కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే గ్రామంలో మరికొందరికి కూడా అధికంగానే కరెంట్‌ బిల్లు వచ్చింది. బండయ్య అనే వ్యక్తికి ఓసారి రూ.78,167, మరోసారి రూ.16,251 వచ్చింది. సాధారణ కూలి పని చేసుకుని జీవించే తమకు ఇంత కరెంట్‌ బిల్లు వస్తే ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి మీటర్‌ బాక్సులో ఏదైనా సమస్య ఉంటే సరిచేయాలని వారు కోరారు. దీనిపై విద్యుత్‌శాఖ అధికారి శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా సాంకేతిక సమస్య లేదా సిబ్బంది బిల్లు తీసేటపుడు పొరపాటు చేసి ఉండొచ్చన్నారు. మీటర్లలో సమస్య ఉందా? అనే కోణంలనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. అవకాశం ఉంటే వారి బిల్లు తగ్గించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని