Antibodies in Breast Milk: తల్లి పాలలోనూ కొవిడ్‌ యాంటీబాడీలు..!

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న తల్లి పాలలోనూ క్రియాశీల కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Published : 15 Nov 2021 16:28 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్‌: కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు వైరస్‌ నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ కల్పిస్తాయని అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బాలింతల్లో ఈ యాంటీబాడీల స్థాయిలు ఎలా ఉంటాయనే విషయంపైనా నిపుణులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న తల్లి పాలలోనూ క్రియాశీల కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే, ఈ యాండీబాడీలు వైరస్‌ నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాజా అధ్యయనం అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌ (JAMA)లో ప్రచురితమైంది.

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడిన లేదా వ్యాక్సిన్‌ తీసుకున్న బాలింతల్లో యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉంటాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా 77మంది బాలింతల నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో 47మంది ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారు కాగా వ్యాక్సిన్‌ గ్రూపునకు చెందిన 30 మంది మహిళల నుంచి నమూనాలు తీసుకున్నారు. వీరిలో ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తల్లుల్లో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు (IgA) అధిక స్థాయిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మరోవైపు వ్యాక్సిన్‌ తీసుకున్న తల్లుల్లోనూ బలమైన (IgG) రోగనిరోధక ప్రతిస్పందనలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రెండు విధాల్లో ఉత్పత్తి  అయిన యాంటీబాడీలు కొవిడ్‌-19ను తటస్థీకరిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

ఇన్‌ఫెక్షన్‌ సోకిన తల్లులతోపాటు వ్యాక్సిన్‌ తీసుకున్న తల్లుల్లో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు క్రియాశీలకంగా ఉన్నాయని తాజా అధ్యయనం ద్వారా ఒకేసారి తెలుసుకున్నట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ రొచెస్టర్‌ మెడికల్‌ సెంటర్‌ (URMC)కు చెందిన బ్రిడ్జెట్‌ యంగ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్‌ నుంచి పొందిన యాంటీబాడీలు మూడు నెలల వరకు ఉంటున్నట్లు గుర్తించామన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలోనూ ఇదే తరహాలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉంటున్నట్లు వివరించారు. అయితే, ఇలా తల్లిపాలల్లో ఉండే కొవిడ్‌ యాంటీబాడీలు చిన్నారులకు వైరస్‌ నుంచి రక్షణ కలిగిస్తాయా లేదా అనే విషయం ఇంకా నిరూపితం కాలేదని పరిశోధకులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు