Hyderabad news: రూ.కోటిన్నర సొత్తు బాధితులకు ఇస్తున్నాం: సజ్జనార్‌

సాధారణంగా చోరీ కేసుల్లో పోయిన సొత్తు తిరిగి వస్తుందా? లేదా? అనే అనుమానం ఉండేది. కానీ, నేటితో అది తొలగిపోయిందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం...

Updated : 27 Jul 2021 19:28 IST

హైదరాబాద్‌: సాధారణంగా చోరీ కేసుల్లో పోయిన సొత్తు తిరిగి వస్తుందా? లేదా? అనే అనుమానం ఉండేది. కానీ, నేటితో అది తొలగిపోయిందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘పోగొట్టుకున్న సొత్తును ఇప్పించాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈరోజు అది సాధ్యమైంది. ఇప్పటినుంచి తరచూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రయత్నం చేస్తా. 176 కేసుల్లో రూ.కోటిన్నర విలువైన సొత్తును నేడు బాధితులకు తిరిగి ఇస్తున్నాం. కేసు కట్టడం ఒక ఎత్తు అయితే పోయిన సొత్తు రికవరీ చేయడం ఇంకో ఎత్తు. విధులను సమర్థంగా నిర్వర్తించిన వారందరికీ అభినందనలు. చోరీ కేసులో సొత్తును తిరిగి ఇప్పించడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమైంది. చోరీ అయిన సొత్తును తిరిగి ఇప్పించడం పోలీసు వ్యవస్థలో ఓ భాగం. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలి.. అలసత్వం వహించరాదు. వెంటనే ఫిర్యాదు చేస్తే నేరస్థుడిని పట్టుకునే అవకాశం ఉంటుంది.. లేదంటే అతడు మరిన్ని నేరాలు చేయగలుగుతాడు. బాధితులకు ఇక నుంచి శ్రమ లేకుండా చోరీ అయిన సొత్తును కోర్టు నుంచి తిరిగి ఇప్పించే బాధ్యతను సైబరాబాద్‌ పోలీసులు తీసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు పోలీసుల పట్ల మరింత నమ్మకం పెరుగుతుంది. సైబరాబాద్‌ పోలీసులకు ఈరోజు సంతృప్తికరమైన రోజు’’ అని సీపీ సజ్జనార్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని