AP News: తల్లి మృతదేహంతో తహసీల్దార్‌ ఆఫీస్‌లో కుమార్తెల నిరసన

మహిళా రైతు మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆందోళనకు దిగారు.

Updated : 26 Oct 2021 14:24 IST

బత్తలపల్లి: మహిళా రైతు మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జలాలపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (70) అనే మహిళా రైతుకు అదే గ్రామంలో 19.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆమె భర్త పెద్దన్న కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం తన పేరుతో ఇవ్వాలంటూ ఏడేళ్లుగా బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయం చుట్టూ లక్ష్మీదేవి తిరిగేది. ఇటీవల కొంతకాలంగా ఆమె అనంతపురం నగరంలోని నవోదయ కాలనీలోని తన కుమార్తె నాగేంద్రమ్మ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఉదయం లక్ష్మీదేవి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.

సకాలంలో పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వకపోవడం వల్లే తన తల్లి మానసిక ఆవేదనతో మృతి చెందిందంటూ ఆమె ఇద్దరు కుమార్తెలు నాగేంద్రమ్మ, రత్నమ్మలు అంబులెన్స్‌లో లక్ష్మీదేవి మృతదేహాన్ని బత్తలపల్లి తహసీల్దారు కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ తహసీల్దారు టేబుల్‌పై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. తహసీల్దారు సెలవులో ఉండటంతో.. రెవెన్యూ సిబ్బంది వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న బత్తలపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి ఎక్కించి తిరిగి అనంతపురం పంపించారు. ఈ ఘటనపై జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని