
Dollar Seshadri: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
ఎంవీపీ కాలనీ(విశాఖ): తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం రాత్రి 8 గంటలకు కల్యాణరథంలో విశాఖలోని ఎంవీపీ కాలనీకి చేరుకున్న ఆయన తితిదే కల్యాణమండపంలో జరిగిన స్వామివారి పవళింపు సేవలో పాల్గొన్నారు. అనంతరం తితిదే ఉద్యోగులతో కాసేపు మాట్లాడి.. కల్యాణ మండపంలోనే బస చేశారు.
ఈ క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తితిదే అధికారులు ఆయన్ను రామ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆంధ్రా మెడికల్ కాలేజ్ అనాటమి నుంచి శేషాద్రి భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. రేపు తిరుపతి గోవిందధామంలో శేషాద్రి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
స్వామివారి సేవలో కన్నుమూసినా పర్వాలేదనేవారు: ధర్మారెడ్డి
1978 నుంచి శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి తరిస్తున్నారు. 2007లోనే రిటైర్ అయినప్పటికీ ఆయన సేవలను గుర్తించిన తితిదే ఓఎస్డీగా కొనసాగిస్తోంది. డాలర్ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)కి తీరని నష్టమని.. ఆయన లేని లోటు భర్తీ కాదని చెప్పారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని శేషాద్రిని సూచించానన్నారు. స్వామివారి సేవలో కన్నుమూసినా పర్వాలేదనేవారని ధర్మారెడ్డి గుర్తు చేసుకున్నారు. శ్రీవారి సేవలో తరించడమే తన జీవిత లక్ష్యమని శేషాద్రి చెప్పేవారని వివరించారు. 2013లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగిందని ధర్మారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి
Advertisement