AP News: కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ.. వైభవంగా హంసవాహన సేవ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి ఉత్సవాల్లో చివరి అంకం అమ్మవారి జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. 

Updated : 15 Oct 2021 19:48 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో చివరి అంకం అమ్మవారి జయజయధ్వానాల మధ్య ఘనంగా ముగిసింది. విజయదశమి రోజున రాజరాజేశ్వరిదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భవానీమాలలు వేసుకుని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం పూర్ణాహుతితో దసరా వేడుకలు ముగిశాయి. సాయంత్రం 5గంటల తర్వాత నగరోత్సవం నిర్వహించారు.

ఆది దంపతుల నగరోత్సవం దేదీప్యమానంగా సాగింది. దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల నగరోత్సవం నిర్వహించారు. మల్లేశ్వరాలయం నుంచి ప్రారంభమైన నగరోత్సవం మేళతాళాలు.. మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా సాగింది. కళావేదిక వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం నుంచి నగరోత్సవంలో భాగంగా దుర్గాఘాట్‌ వరకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. అనంతరం కృష్ణానదిలో హంసవాహనంపై  గంగాపార్వతీ సమేత మల్లేశ్వరులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో జలవిహారం నిలిపివేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, సీబీ బి.శ్రీనివాసులు, దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, వేదపండితులు హంసవాహన సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం బ్యారేజీ, దుర్గాఘాట్‌, పున్నమిఘాట్‌ నుంచి భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాలను తిలకించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని