sabitha Indrareddy: అన్నీ ఆలోచించాకే పాఠశాలలు ప్రారంభిస్తున్నాం: సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను

Published : 27 Aug 2021 01:39 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కౌకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న శానిటేషన్ పనులు, తరగతి గదులు, మైదానాన్ని పరిశీలించారు. విద్యార్థుల మరుగుదొడ్లను పరిశీలించిన మంత్రి.. వెంటనే నీటి సదుపాయం కల్పించాలని గ్రామ సర్పంచ్‌ను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో గుంతలు పూడ్చాలని, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. గురువారం నుంచి ఉపాధ్యాయులు ప్రతి రోజు పాఠశాలలకు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. చాలా రోజుల తర్వాత విద్యార్థులు పాఠశాలలకు వస్తున్నందున కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అనంతరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంత్రి పరిశీలించారు.

అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అన్ని కోణాల్లో ఆలోచించి, చర్చించిన తర్వాతే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సీఎం కేసీఆర్ పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాం. ఇక నుంచి ఆఫ్ లైన్‌లో తరగతులు ఉంటాయి. వైద్యారోగ్య శాఖ నివేదిక ప్రకారమే సెప్టెంబర్ 1నుంచి తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం చేస్తున్నాం. సుమారు 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు రాబోతున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. సర్పంచుల ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలి. ప్రైవేటు పాఠశాలలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల తరలింపులో జాగ్రత్తలు పాటించాలి. పాఠశాల బస్సులను నిత్యం శానిటైజ్‌ చేయాలి’’ అని మంత్రి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని