Rains: భారీ వర్షాలు కురుస్తున్నా 24 గంటలు విద్యుత్‌ సరఫరా: ప్రభాకర్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24 గంటలు విద్యుత్‌ సరఫరా

Updated : 07 Sep 2021 14:36 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. ఇలాంటి విపత్తులు వస్తాయని ముందుగానే ఊహించి బొగ్గును నిల్వ చేసుకున్నామన్నారు. దీని వల్ల అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ బదులిచ్చామని చెప్పారు. వర్షాల వల్ల గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోనూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ప్రభాకర్‌రావు తెలిపారు. విద్యుత్‌ స్తంభాలు, తీగలను తాకొద్దని సూచించారు.

విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పవర్‌గ్రిడ్‌ నిర్వహణ చేస్తున్నట్లు వివరించారు. కొత్తగూడెం ప్లాంట్‌లోకి నీరు చేరినా.. ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పారు. డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారని తెలిపారు. ‘‘శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్‌లో అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. విద్యుదుత్పత్తి నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నందున విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం’’ అని ప్రభాకర్‌రావు అన్నారు.

వారం రోజులగా కురుస్తున్న వర్షాల వల్ల ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఇంజినీర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. రానున్న మూడు రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇంజినీర్లకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అన్ని సబ్ స్టేషన్‌లలో అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు మెటీరియల్‌ను అందుబాటులో ఉంచామని వివరించారు. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లలో ఉన్న మీటర్లను మొదటి అంతస్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు. విద్యుత్‌కు సంబంధించి ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574కు ఫోన్ చేసి గానీ, సంస్థ మొబైల్ యాప్, ట్విటర్, ఫేస్‌బుక్‌ ద్వారా సంప్రదించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని