ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వండి.. ఐటీ, కార్పొరేట్ సంస్థలకు తమిళిసై విజ్ఞప్తి

నిరుపేద విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యకు దూరం కాకుండా తగిన సహాయం అందించాలని ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి

Published : 28 Oct 2021 01:17 IST

హైదరాబాద్: నిరుపేద విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యకు దూరం కాకుండా తగిన సహాయం అందించాలని ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. ల్యాప్‌టాప్, ట్యాబ్లు అందుబాటులో లేక రాష్ట్రంలోని చాలా మంది పేద, వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యకు దూరంగా ఉంటున్నారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఐటీ కంపెనీలు, కార్పొరేట్, ఇతర సంస్థల వద్ద చాలా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు నిరుపయోగంగా ఉన్నాయనే విషయం తెలిసిందన్నారు. వాడుకొనేందుకు వీలుగా ఉండి వినియోగించకుండా పక్కన పెట్టిన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఆయా కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు విరాళంగా ఇస్తే పేద విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యను కొనసాగించేందుకు దోహదపడుతుందని తమిళిసై అభిప్రాయపడ్డారు.

ఈ ప్రక్రియను సమన్వయం చేసేందుకు రాజ్‌భవన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు గవర్నర్ వెల్లడించారు. రాజ్‌భవన్‌ సహాయక విభాగాధికారి కె.అమర్‌నాథ్‌ను ఇందుకు ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు, వ్యక్తులు 94900-00242 నంబర్లను సంప్రదించాలని సూచించారు. లేదా rajbhavan-hyd@gov.in కు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చన్నారు. ఆన్‌లైన్ విద్యాభ్యాసం కోసం ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అవసరమయ్యే విద్యార్థులు కూడా వారి పూర్తి వివరాలను rajbhavan-hyd@gov.in కు తమ అభ్యర్థనను పంపాలని గవర్నర్ పేర్కొన్నారు. పేరు, చిరునామా, మొబైల్ నంబర్, చదువుతున్న తరగతి-కోర్సు, కళాశాల పేరు, కళాశాల చిరునామా, కళాశాల ఫోన్ నంబర్, బోనఫైడ్ ధ్రువపత్రాన్ని అప్‌లోడ్ చేయాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని